జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం, బాసర

Sample Image

నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా,రెండవది ఇదేనని చెపపుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

మనదేశంలో రెండు ప్రసిద్ధి చెందిన సరస్వతి దేవాలయాలలో ఒకటిగా బాసర ఎంతో ప్రసిద్ధి చెందినది.ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎంతో మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

వసంత పంచమి రోజు ఆ సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు.ఆరోజున కొత్తగా చదువును ప్రారంభించేటటువంటి పిల్లలకు తమ తల్లిదండ్రులు బాసరకు తీసుకువెళ్లి అక్కడ అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు చదువులో మంచి విజయం సాధిస్తారని నమ్ముతారు.

అందువల్ల ప్రతి సంవత్సరం వసంత పంచమిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తమ పిల్లలను తీసుకొని ఇక్కడే అక్షరాభ్యాసం చేయిస్తారు.మన పురాణాల ప్రకారం వ్యాసమహర్షి, అతని శిష్యులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒక చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని భావిస్తారు.

అలాంటి వాతావరణం వెతకడం కోసం వ్యాసమహర్షి దండక అనే అరణ్యానికి వెళ్తారు.అక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉండటంతో ఆ అడవిలో నివాసం ఉండాలని భావిస్తారు.

వ్యాసమహర్షి ఆ దండకారణ్యంలో తన వ్యాసాలతో, ప్రార్థనలతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆ ప్రాంతాన్ని వసారా అని పిలిచారు.కాలానుగుణంగా వసారా అన్న పదం నుంచి బాసర ఉద్భవించింది.

ఒకరోజు గోదావరి నదిలో స్నానమాచరిస్తున్న వ్యాసమహర్షికి సరస్వతి దేవిసాక్షాత్కరించి, భూలోకం మీద తన నివాస స్థానం బాసరేనని అక్కడ తన విగ్రహాన్ని రూపొందించాలని వ్యాస మహర్షికి చెప్పడంతో వ్యాసమహర్షి ప్రతిరోజు ఒక పిడికెడు మట్టి తో అమ్మవారి సైకత శిల్పాన్ని రూపొందిస్తాడు.ఆ రూపమే ఇప్పుడున్న అమ్మవారి మూలవిరాట్ అని పురాణ కథలు గా చెబుతారు.

ఇలా ప్రసిద్ధి చెందిన సరస్వతి అమ్మవారికి వసంత పంచమి వంటి ప్రత్యేక రోజులలో ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.ఆరోజు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి సందర్శించి వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో విశేషం.

ఆలయ విశేషాలు

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.