భాస్కరా శతకము

  1. శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ
    రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
    ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్
    సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!

    భావం:

    ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టిధర్మం!.

  2. కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో
    బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్
    దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా
    పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!

    భావం:

    చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరామునిచేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు.

  3. పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్
    పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే
    చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్
    శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!

    భావం:

    మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు.

  4. అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్
    వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా
    తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా
    ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా

    భావం:

    పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏదిఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు.

  5. ఎడపక దుర్జనుండొరుల కెంతయు గీడొనరించును గాని యే
    యెడలను మేలు సేయడొక యించుకయైనను; జీడపుర్వు తా
    జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంచనేర్చునే
    పొడవగుచున్న పుష్ప ఫలభూరుహ మొక్కటిైనె న భాస్కరా!

    భావం:

    చెడుస్వభావం కలిగినవారు ఇతరులకు చెడు చేస్తారే గాని, ఎటువంటి పరిస్థితులలోనూ ఏ మాత్రం మంచి చేయరు. ఇటువంటివారి ప్రవర్తన చీడపురుగును పోలి ఉంటుంది. చీడపురుగు చెట్టుకు ఎటువంటి మేలు అంటే కనీసం పుడిసెడు నీరైనా పోయకపోగా... పూలు, పండ్లతో నిండుగా ఉండి, చక్కగా పెరుగుతున్న చెట్లను పాడుచేస్తుంది.

  6. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
    చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
    బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
    పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

    భావం:

    ఒక మనిషి ఎంత విద్వాంసుడైనప్పటికీ, విద్యలోని సారాన్ని కొద్దిగానైనా గ్రహించకపోతే అటువంటి విద్య ఎందుకూ పనికిరాదు. ఆ విద్యను పండితులైనవారెవ్వరూ మెచ్చుకోరు. నలమహారాజులాగ వంట చేసినప్పటికీ అందులో ఉప్పు వేయకపోతే ఆ కూరకు రుచికలగదు.చేసే పని సక్రమంగా ఉండాలి. అప్పుడే దానికి పండితులనుంచి, మేధావుల నుంచి తగిన గుర్తింపు వస్తుంది. అంతేకాని, పనిని మొక్కుబడిగా చేయటం వల్ల దానికి గుర్తింపు రాదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.

  7. తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము
    ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్
    బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం
    జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!

    భావం:

    కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది.

  8. ఉరుగుణవంతు డొడ్లుదన కొండపకారము సేయునప్పుడున్
    బరహితమే యొనర్చు నొకపట్టుననైనను గీడుజేయగా
    నెఱుగడు నిక్కమే కదయ దెట్లన గవ్వముబట్టి యెంతయున్
    దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా!!

    భావం:

    మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు చేయడంలో గొప్పతనం ఏమీ ఉండదని మన పెద్దలు అంటారు. మంచి చేసిన వారికి మంచి చేయడం మరింత గొప్ప మానవత్వం అనిపించుకొంటుంది. అలాగే, చెడు చేసిన వారికి ప్రతిగా చెడునే చేయకుండా, మంచి చేయడమే ఉత్తమ లక్షణం. ఇదే గుణవంతుని తత్వం కూడా. ఎలాగైతే, పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుందో అలా.

  9. ఊరక వచ్చు బాటుపడ కుండినవైన ఫలంబదృష్టమే
    పారగగల్గువానికి బ్రయాసము నొందిన దేవదానవుల్
    వారలటుడుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగాదె శృంగా
    రపుబ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!

    భావం:

    అదృష్టవంతులకు ఇతరుల ప్రయాసలకు అతీతంగా మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ఎదుటివారి కష్టనష్టాల ప్రభావం వీరిపై ఏ మాత్రం పడదు. అందుకే, అదృష్టవంతులకు ఎప్పుడూ నిశ్చింతే. ఎందుకంటే, అన్నీ మంచి ఫలితాలే కనుక. ఎలాగంటే, దేవదానవులు పాలకడలిని చిలుకుతూ కష్టపడుతుంటే, శ్రీమహావిష్ణువుకు లక్ష్మీదేవి లభించినట్లు.

  10. తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా
    చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
    గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై
    బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!

    భావం:

    దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!

  11. అదను దలంచికూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
    గదిపి పదార్థ మిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
    మొదటికి మోసమౌ, బొదుగు మూలము గోసిన బాలుగల్గునే
    పిదికిన గాక భూమిబశుబృందము నెవ్వరికైనా భాస్కరా!

    భావం:

    పాలిచ్చే గోవునైనా, శ్రమకోడ్చే పశువులనైనా మచ్చికతో ఆదరింపజేసుకోవాలి. కానీ, పాలకోసం పొదుగును కోయడం, పనుల కోసం హింసించడం మంచిదికాదు. పాలకుడు కూడా ప్రజల మనసును తెలుసుకొని పన్నులు విధించాలి. అలా కాకుండా దౌర్జన్యానికి దిగితే వారి మనసు గెలువలేరు. కనుక, దేనినైనా ప్రేమతోనే జయించాలి మరి.

  12. భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర
    జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై
    యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ
    క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!

    భావం:

    పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి.

  13. నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం
    గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా
    చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం
    జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా

    భావం:

    దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడు కాలములో మంచిమాటలు చెవికెక్కవు.

  14. తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్
    మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్
    బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్
    జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా

    భావం:

    పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంత మేలు చేసినా కీడే జరుగును.

  15. నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం
    గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద
    ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా
    దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా

    భావం:

    ఎవరైన పసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్ల ేపండితులు మాటల నేర్పు లేనివారిని చూసి సంతసింతురు.

  16. తెలియని కార్యమెల్లఁగడతేర్చుట కొక్కవివేకి జేకొనన్
    వలయునట్లైన దిద్దుకొనవచ్చుఁబ్రయోజనమాంద్యమేమియుం
    గలుగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేతనద్దమున్
    గలిగిన జక్క జేసికొనుగాదె నరుం డది చూచి భాస్కరా!

    భావం:

    మనుజుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు అద్దముతో బొట్టును వంకర టింకర లేకుండా సరిచేసుకొనును. అలాగే నేర్పరి వద్దకెళ్ళి పనులను చక్కదిద్దుకొని సంతోషాతిశయమును తెలివిగలవాడు పొందునని భావం.

  17. తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో
    బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా
    నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్
    దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా

    భావం:

    గొప్పవారి బలము తెలియక కోపముతో ఎదిరించిన చెడుదుర, పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.

  18. పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస
    త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్
    గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై
    గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా

    భావం:

    మహాత్ములు పరులకు కష్టములో సాయపడుదురు.రాళ్ళ వాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని,గోపకుల్ని కాపాడాడు.

  19. చక్కదలంపగా విధివశంబున నల్పుని చేతనైనదా
    జిక్కియవస్థలంబొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్
    మిక్కిలిసత్వ సంపదల మీరిన గంధగజంబు మావటీ
    డెక్కియదల్చి కొట్టికుదియించిన నుండదెయోర్చి భాస్కరా

    భావం:

    బలమైనఏనుగు మావటిమీదెక్కి అంకుశంతో పొడిచి ఆదలించిన సహించును.అట్లే, ఎంత బలుడైనా విధివశమున అల్పునిచే పీడింపబడును.

  20. బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
    బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై
    జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా
    బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా

    భావం:

    బలముంటే బంధువుల సాయముంటుంది లేకుంటే శత్రువులౌతారు. మంటల్ని గాలి మరింత పెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది.