దాశరధి శతకము

  1. శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
    గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
    ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
    త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ

    భావం:

    రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!

  2. రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
    స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
    శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
    ద్ధామ విరామ భద్రగిరి - దాశరధీ కరుణాపయోనిధీ!

    భావం:

    జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!

  3. అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
    విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
    ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
    ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!

  4. రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
    త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
    త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
    తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.

    భావం:

    శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!

  5. శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
    పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
    చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
    తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    సంపదల నిచ్చువాడవు, మునులచే బూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు జంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్ర - నిధీ!

  6. ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
    రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
    కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
    త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశ - నిధీ!

  7. మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
    ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
    రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
    రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
    తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

    భావం:

    రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. భద్ర - నిధీ!

  8. శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
    దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
    దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
    తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    హారములు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షమవు, వికారములు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను బోషించువాడవు, పాపముల బోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్ర - నిధీ!

  9. దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
    భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
    స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
    ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.

  10. కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
    జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
    జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
    దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.

  11. శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
    త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
    పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
    తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

    భావం:

    రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.

  12. గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
    సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
    కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
    ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    మూఢులు గ్రంధములలోని రసముయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లన చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కఱగి జాఱునట్లు వింధ్యపర్వతమున నుండు ఱాళ్ళు జాఱవు.

  13. తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
    ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
    బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
    దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    నా మాటలలో దప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే, ఎట్లన గంగానది నీరు వంకరగ బాఱినను, ముఱికిగ మాఱినను దాని గొప్పతన మెక్కడ పోవును?

  14. దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
    స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
    చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
    తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చునకు నమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.

  15. హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
    కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
    పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
    తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ

    భావం:

    నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము.

  16. ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
    గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
    గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
    తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ

    భావం:

    ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను.

  17. పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
    స్ధిరమతులై సదాభజన సేయు మహత్ముల పాదధూళి నా
    శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
    త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    దయకు సముద్రమువంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ యని నిలుకడగల బుధ్ధితో గొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని యాజ్ఞాపించును

  18. అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
    ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
    భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
    డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ

    భావం:

    బ్రహ్మకు దండ్రివి, సనకాదులకున్ బరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో నధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.

  19. పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
    ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
    దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
    దండలు గాగ నా కవిత దాశరధీ కరుణాపయోనిధీ!

    భావం:

    పండిత రక్షకుఁడు, పాపములఁ బోఁగొట్టువాఁడు, బ్రహ్మేంద్రాదులచే బూజింపఁబడినవాఁడు, రావణాసురిని సంహరించినవాడను నీ కీర్తి కన్యకు నా కవిత్వమును బూదండవలెనిత్తును.

  20. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
    చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
    న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
    ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.

    భావం:

    లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడ నీవు దా - నిధీ!