శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయం - ఖాజీపేట
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కు 13 కి.మీ., దూరంలో కాజీపేట పట్టణము విష్ణుపురి కాలనీలో శ్రీ శ్వేతార్క మూలగణపతి ఆలయం కలదు. ఈ ఆలయం నూతనంగా నిర్మించిన ఆలయం. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన దేవాలయాలలో ఈ శ్వేతార్క గణపతి ఆలయం ఒకటి. వేలాదిమంది భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలను ప్రసాదిస్తూ, కేవలం గరికలతో ప్రదక్షిణాలు చేస్తూ సంకల్పసిద్ధిని పొందుతున్న అనేకమంది భక్తులకు అభయమిస్తూ సకల కార్యసిద్ధికరుడుగా వెలుగొందుతున్నారు. ఆసియా ఖండంలోనే మరెక్కడా లేని విధంగా శ్వేతార్కమూల గణపతి నల్ల గొండ జిల్లా నివాసి అయిన మాద ప్రభాకర శర్మగారి ఇంటి ఆవ రణలో ఇది లభ్యమైనది.
1996వ సంవత్సరం ఒకనాటి రాత్రి శ్రీ శర్మగారికి స్వామివారు కలలో కనబడి తన ఇంటి ఆవరణలో తెల్లజిల్లేడు వృక్షమూలమున స్వయంభువుగా వెలిశానని తెలియజేయగా, మరునాడు శర్మగారు చూడగా స్వామివారు శ్వేతార్కమూలములో అవతరించాడు. ఈ శ్వేతార్కమూల గణపతిస్వామి వారు సర్వావయవములు సంపూర్ణంగా ఉండి ఎలాంటి చెక్కడములు మల్చ డములు లేకుండా అన్ని అవయవాలు స్పష్టంగా నేత్రములు, నుదురు, దంతములు,జ్ఞానదంతము, కాళ్లు, పాదములు, చేతులు, తల్పము, సింహాసనము, మూషికము (ఎలుక) మోదకములతో సహా సంపూర్ణ ఆకృతినిపొంది దర్శనమిచ్చాడు.
ఈ శ్వేతార్క మూల గణపతికి ఆలయమును ఉత్తర, దక్షిణాది ప్రాంతాలలో కనిపించే రీతిలో ఈ దేవాలయ నిర్మాణంజరిగింది. అయిదుగురు పీఠాధిపతులు, వేద పండితుల సమక్షంలో సుమారు 18.5 కిలోల వెండితో కవచమును తయారుచేయించి స్థిర ప్రతిష్ఠ చేయబడినది. భక్తుల కోరికలను ప్రత్యక్షంగా తీరుస్తున్న ఈ స్వామివారిని ఒకసారైన దర్శించి తరించగలరు. మంగళవారం నాటి స్వామివారి దర్శనం, ప్రదక్షిణలు విశేషం.
ఈ స్వామివారు శ్వేతార్కమూల గణపతి అనే పేరుతో ఎందుకు పిలువబడుతున్నాడు? అనగా శ్వేతము అనగా తెలుపు అని, అర్కము అనగా జిల్లేడు అని, మూలము అనగా వేరు మొదట్లో నుండి అని తెలియజేస్తూ ఈ శ్వేతార్కమూల గణపతిని గూర్చి చెప్పబడింది. నారదాది మహా పురాణ గ్రంథాలలో శ్వేతార్క గణపతిని గూర్చి ఈ విధంగా తెలియజేయబడింది. తెల్లజిల్లేడు వృక్షం § (100) సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించి ఉండినచో ఆ వృక్షపు మూలములో వేర్లు గణపతి ఆకృతి (రూపం) తయారు కాగలదని చెప్పబడి ఉంది. నూరు సంవత్సరాలు నిండిన తెల్లజిల్లేడు వృక్షం వేళ్ళు మొదళ్ళలో ఉద్భవించిన గణపతి రూపంను శ్వేతార్క మూల గణపతి అంటారు.
స్వయంభూ శ్రీ శ్వేతార్క మూలగణపతిస్వామివారి సన్నిధిలో మరికొంతమంది దేవతామూర్తులను కూడా మనము దర్శించగలము. వారిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ జ్ఞానముద్రా సరస్వతీ అమ్మవారు (ఇక్కడి అమ్మవారికి చేతిలో వీణలేకుండా జ్ఞానముద్రను కలిగి ఉంటుంది), శ్రీ సంతోషిమాత, శ్రీ సంతాన నాగలింగేశ్వరస్వామి, శ్రీ షిర్డీసాయిబాబా, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నవగ్రహములు, అయ్యప్పస్వామి, ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి దేవాలయాలు కలవు.
ఈ ఆలయం నందు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజున ఉదయం 5 గంటలకు పంచామృతాభిషేకము, పంచాంగ శ్రవణం, వైశాఖ శుద్ధ పంచమి శ్రీ స్వామివారి వార్షిక వసంతోత్సవములు, కళ్యాణోత్సవము భాద్రపద శుద్ధ చవితి నవరాత్రోత్సవములు ప్రారంభం, చివరి రోజున కళ్యాణోత్సవము కార్తీక పౌర్ణమి రోజున హరిద్రా గణపతి అలంకారము, శతాధిక దీపారాధనోత్సవం కార్తీకమాసంలో ఒక రోజున (భక్తులతో) తీర్థ యాత్ర సత్యవ్రతం, వనభోజనం జనవరి నెలలో మొదటి మంగళవారం రోజున శతాధిక రుచికర చిత్రాన్నపూజ (200 కిలోలకు పైగా పులిహోర నివేదన) మాఘమాసంలో మహాశివరాత్రి రోజున ఏకధారాభిషేకము జరు పబడును. ప్రతి మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుండి రాత్రి 9.30 గంటలవరకు దేవాలయం నందు సామూహిక వినాయక వ్రతములు, గణపతి హోమము, మహార్చన, సాయంకాలార్చన, అన్నదానము జరుపబడును.