శ్రీ సిద్ధి వినాయకస్వామి దేవాలయం - వెస్ట్ మారేడ్ పల్లి

Sample Image

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో, వెస్ట్ మారేడ్ పల్లిలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయం ఉన్నది. దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో శ్రీ సిద్ధి వినాయకుడ్ని ప్రతిష్టించారు.

ఇక్కడే ఉన్న ఆలయ ప్రధాన ద్వారంపై శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి, వారి వాహన ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సప్తవర్ణ శోభిత ఆలయ శిఖరాలు, శిల్పాలు, తీర్చిదిద్దిన స్తంభాలు, ముచ్చటగొలిపే చిత్తరువులు, నిత్యకల్యాణం, పచ్చతోరణంగా విలసిల్లే ఆహ్లాదకరమైన వాతావరణం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ సముదాయంలో నిత్యపూజా కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు ఆలయ ప్రవేశం చేసి, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి నమస్కరించి, గర్భాలయ ప్రదక్షిణలు పూర్తి చేసి, అనంతరం ఆలయ మంటపానికి చేరుకొని మూషిక రాజుకు నమస్కరిస్తారు.

గర్భాలయంలో ఉన్న సిద్ధ వినాయకుడు సర్వాలంకార శోభితంగా, ఆపాదమస్తకం రజత కవచంతో స్వామి ధవళ కాంతులతో ఇక్కడ 11 వారాలు మ్రొక్కుకొని, స్వామి వారికి 108 ప్రదక్షిణలు పూర్తిచేస్తే అనుకొన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఐదు అంతస్తుల గాలిగోపురం ఇరువైపులా ద్వారపాలకులు స్థానక భంగి మలో నెలకొని ఉన్నారు.

భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం చుట్టూ అష్టవిధ గణపతులు కొలువై ఉన్నారు. ఈ సముదాయం భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తుంది.

ఈ ఆలయంలో ప్రతినిత్యం పంచామృతాభిషేకం, అలంకరణ, మంగళహారతి వంటి పూజాకార్యక్రమాలు జరుగుతాయి. ప్రతినెల సంకటహర చతుర్థికి మహా గణపతి హోమం ఆగమోక్తంగా నిర్వహిస్తారు. వినాయకచవితినాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి సన్నిధి ఉన్నది. కుజదోషం, సర్ప దోషం కలవారికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్టి, స్కంధపంచమి వంటి పర్వదినాలలో ఇక్కడ స్వామివారికి విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు.

శ్రీ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఈ శివాలయంలో నిత్యం శ్రీచందనపు పూతతో నెలకొని ఉమామహేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ప్రతిరోజూ ప్రదోషకాలంలో అభిషేకం, మాస శివరాత్రులలో రుద్రహోమం, మహాశివరాత్రినాడు శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఉమామహేశ్వరస్వామి వారి ఆలయానికి ప్రక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి ఉన్నది. శృంగేరి శంకరా చార్యులైన భారతీ తీర్థస్వామి వారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో మూలా నక్షత్రపూజలు, చండీహోమాలు, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యం కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ప్రాంగణంలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయం ఉన్నది. ప్రతి మంగళ వారం తోమాల సేవ నిర్వహిస్తారు. హనుమజ్జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే నవగ్రహ మంటపం ఉంది. నవగ్రహ మూర్తులకు గ్రహదోషాలు ఉన్నవారు వాటి నివారణ కొరకు ఈ నవగ్రహాలకు ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తారు. ఇచ్చటనే అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది. ఈ వృక్ష సమ్మేళనం క్రింద జంట నాగప్రతిమలు, విఘ్నేశ్వర ప్రతిమ నెలకొని ఉన్నాయి. భక్తులు వీటిని కూడా దర్శిస్తారు.