పిళ్ళైయార్ పట్టి

Sample Image

తమిళనాడు లోని శివగంగ జిల్లాలో తిరుప్పత్తుర్ తాలూకాలో పిళ్ళైయార్ పట్టి అనే గ్రామం కలదు. ఇది పుదుకొట్టై, కారైకుడి మధ్యన ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కర్పక వినాయకర్ ఆలయం కలదు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయక ఆలయాలలో ఇది మొదటిది.

పిళ్ళైయార్ ఆలయం ఒక పురాతన ఆలయం. రాతిశిలల తొలిచి అద్భుత గుహాలయంగా మార్చి వినాయకునికి అంకితం చేశారు. ఈ గుహాలయంలో శివుడు మరియు ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కలవు. ఆలయానికి ఉపయోగించిన రాళ్ళను, ఆగమ శాస్త్రాన్ని కలిపి పరిశీలిస్తే .. ఈ దేవాలయం క్రీ.శ. 1091 - 1238 మధ్య నిర్మించినట్లు తెలుస్తున్నది.

శ్రీ కర్పక వినాయగర్ గుహాలయంలో వినాయకుని రాతి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో అలరిస్తుంది. గుడి ముందు కోనేరు, గుడిలో వినాయకుని విగ్రహం తప్పక చూడాలి. ఆలయ సన్నిధిలో ఆయిల్ దీపాలు నిత్యం వెలుగుతూ గర్భగుడి లోపల కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. గుడిలో వినాయకుడి విగ్రహం బంగారు ఆభరణాలతో కవర్ చేయబడి ఉంటుంది. అభిషేకం, పవిత్ర స్నానం చేసిన తర్వాతనే భగవంతున్ని పూర్తిగా దర్శించవచ్చు (ఆభరణాలు లేకుండా).

గుడిలో వింత:

గుడి ఆవరణ చాలా విశాలంగా భక్తిని పెంపొందించేలా ఉంటుంది. ప్రాంగణంలోని ఏనుగు ఆశీస్సులు తప్పక తీసుకోవాలి. ఆలయ గోడ పై ఉన్న వినాయకుని చిత్రాన్ని ఎటుపక్క నుండి చూసినా మనవైపే చూడటం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఉత్సవాలు:

వినాయ చతుర్థి / వినాయ చవితి పండుగ ను ప్రతి ఏటా ఆగస్టు - సెప్టెంబర్ మాసాలలో క్రమం తప్పకుండా పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజులలో జరిగే వేడుకలను చూడటానికి చుట్టుపక్క ప్రాంతాల నుంచే కాక, తమిళనాడు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.

గుడి లోపల మూలవిరాట్టు అయిన వినాయకుని వాహనం మూషికం విగ్రహం ఉంటుంది. ఆలయాన్ని దర్శించే భక్తులు ఎవరూ దీనిని గమనించరు ఎందుకంటే ఇది ఒక మూలన ఉంటుంది. మూషికం చెవిలో భక్తులు తమ కోర్కెలను చెబితే అది వినాయకునికి చేరవేస్తుందని ప్రతీతి.