సాక్షి గణపతి

Sample Image

మన భారత దేశంలో ప్రసిద్ది చెందిన గణపతి ఆలయాల్లో ఒకటి సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి. అయితే ఈ ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. ఆ గణపతి శివ భక్తుల అఖండ భక్తికి శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి.

పిళ్ళైయార్ ఆలయం ఒక పురాతన ఆలయం. రాతిశిలల తొలిచి అద్భుత గుహాలయంగా మార్చి వినాయకునికి అంకితం చేశారు. ఈ గుహాలయంలో శివుడు మరియు ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కలవు. ఆలయానికి ఉపయోగించిన రాళ్ళను, ఆగమ శాస్త్రాన్ని కలిపి పరిశీలిస్తే .. ఈ దేవాలయం క్రీ.శ. 1091 - 1238 మధ్య నిర్మించినట్లు తెలుస్తున్నది.

శభక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి గా ప్రసిద్ది చెందాడు. శ్రీశైలంకు వచ్చే భక్తులు ముందుగా సాక్షిగణపతిని సందర్శించి తర్వాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, ఆయన ఈ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి, తల్లి శ్రీ భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని కథనం.

విశాలమైన శ్రీశైలం కొండపై శ్రీశైలం ప్రధాణ ఆలయానికి, శ్రీశైలం ఆనకట్టకు మద్యన సాక్షిగణపతి ఆలయం కొలువై ఉంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. వీరు మొదట శ్రీ సాక్షిగణపతిని దర్శించుకుని తర్వాత ఆ శ్రీ మల్లికార్జున, భ్రమరాంబలను దర్శించుకున్నట్లు క్షేత్ర పురాణం తెలుపుతున్నది.

నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతి:

అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ ఆలయంలోని గణపతి దేవుని తొండం కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడినదిని శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ వచ్చే యాత్రికులు తప్పక ఈ స్వామిని సందర్శిస్తుంటారు.

భారత దేశంలో అనేక గణపతి క్షేత్రాలలో కంటే విభిన్నంగా, అపు‘రూపం'గా అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్నాడని క్షేత్ర మహత్యం తెలియజేస్తున్నది. ఇటువంటి గణపతి రూపంను మీరు మరెక్కడా, ఏ ఇతర గణపతి క్షేత్రాలలోనూ, సాహిత్యంలోనూ చూసి ఉండరు.

గణపతి ఆసీన రూపంలో:

సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రసన్నవదనంతో, కుడవైకు ఉన్న వక్రతుండంతో, ఎడమవైపు పుస్తకాన్ని, కుడిచేత కలం పట్టి శివ పంచాక్షరి (ఓం నమశ్శివాయ) మంత్రం దిద్దుతున్నట్లు ఉండే ఈ సాక్షిగణపతిని చూడటానికి భక్తులు ఏకాగ్రతతో భక్తిభావంతో ఆలయ దర్శనం చేస్తుంటారు. అలాగే మిగిలిన రెండు చేతులతో పాశం, అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు.

అక్షరాలను లిఖిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వణ వేదంలో తెలుపబడినది. పుస్తకం, లేఖిని అజ్జానాన్ని, అవిద్యను నాశనం చేసే ఆయుధాలు కనుక ఈ సాక్షిగణపతిని లేదా వ్రాతపతిని దర్శించి పూజింపడం ద్వారా విద్య లభిస్తుందని పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి.