శ్రీ లక్ష్మీ గణపతిదేవాలయం- వనస్థలిపురం
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని వనస్థలిపురంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఉన్నది. 1883వ సంవత్సరంలో శ్రీ లక్ష్మీగణపతి దేవాలయం నిర్మించబడింది. గర్భాలయంలో ప్రధాన దేవతా మూర్తిగా శ్రీ లక్ష్మీగణపతి దర్శనమిస్తాడు. ఈ గణపతిని దర్శించిన వారి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీగణపతి స్వామి కుడి ప్రక్కన శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయం, ప్రసన్నాంజనేయస్వామి, శ్రీ బ్రహ్మం గారి దేవాలయం, శ్రీ లక్ష్మీగణపతి స్వామికి ఎడమవైపున శివాలయం, అయ్యప్పదేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, జయదుర్గ దేవాలయం, నవగ్రహ దేవాలయాలు కలవు. అన్నీ దేవాలయాలకు కలిపి ఒకే రాజ గోపురం ఉంది.
ఈ ఆలయంలో ప్రతిరోజూ పంచామృతాభిషేకం జరుగుతుంది. గణపతి వస్త్రపూజ, గణపతి సహస్రనామార్చాన, గణపతి హోమం జరుగుతాయి. ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఈ ఆలయంలోని శివలింగానికి బిల్వదళాలతో సహస్రనామార్చన, మాసపూజ, నిత్యాభిషేకాలు జరుగుతాయి.జయదుర్గ ఆలయంలో మంగళవారం, శుక్రవారం విశేషంగా భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయి.
అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజులు దీక్షలు నిర్వహిస్తారు. ప్రతినిత్యం ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.