ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం

Sample Image

భారతదేశంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కర్నాటక రాష్ట్రంలోని “ఉడుపి” ఒకటి. పరశురామ క్షేత్రంగా పురాణాలు పేర్కొనే పశ్చిమ సముద్ర తీరంలో వెలసిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమయినది.

ఈ క్షేత్రానికి గల పురాణనామం “రజతపీఠపురం.” ఈ క్షేత్రవివరాలు స్కాందపురాణంలో “రజతపీఠపుర మాహాత్యమ్” అన్న పేరుతో వర్ణితమయింది.

ఉడుపి ఇతిహాసం:

పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతుండగా ఓ సర్పం నాగలి తగిలి మరణించింది. సర్పదోషం కలుగుతుందని దుఃఖిస్తున్న రామభోజుణ్ణి, పరశురాముడు ఊరడించి, నాలుగు దిక్కులా నాలుగు నాగప్రతిష్టలను చేయమని ఉపదేశించాడు. పరశురాముని ఆదేశానుసారంగా నాలుగు దిక్కులా నాలుగు వెండి పీఠాలను స్థాపించి, వాటిపై నాగప్రతిష్టలను చేసాడు రామభోజుడు. ఆవిధంగా వెండిపీఠాలను కలిగిన స్థలమై “రజతపీఠపురం”గా ఖ్యాతికెక్కింది ఈ క్షేత్రం. అనంతరం పరశురాముడు “అనంతేశ్వరుడు” అన్న పేరుతో, ఓ లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడని స్కాందపురాణం వివరిస్తోంది.

మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. సంస్కృతంలో “ఉడు” అంటే నక్షత్రమని అర్థం. “ప” అంటే పతి అని అర్థం. ఈవిధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా “ఉడుప” అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం. కాలక్రమంలో ఇది ఉడుపిగాను, ఒడిపిగాను పిలువబడుతోంది.

ఇంతటి ప్రాశస్త్యాన్ని కలిగిన ఉడుపి క్షేత్రం ఎన్నో దేవాలయాలకు పెట్టింది పేరు. వీటిలో ప్రముఖమైనది “శ్రీ కృష్ణ మఠం”.

మధ్వాచార్యులు – కృష్ణ విగ్రహం:

ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి నిర్మింపజేసిందనే పురాణ ఐతిహ్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.

ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడుపికి సమీపంలో గల “మల్పే” అన్న ప్రాంతంలో, సముద్రతీరంలో ధ్యానతత్పరులై ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరచి చూడగా, తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. ముఖ్యవాయువు అవతారమైన మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి త్రిప్పి, తుఫానుగాలిని నియంత్రించారు. బ్రతికి బైటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దనున్న రత్నాలను సమర్పించబోయారు. వాటిని నిరాకరించిన మధ్వాచార్యులు, నౌకను సమతౌల్యంలో ఉంచడానికి వాడుతుండిన రెండు పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ ముద్దలు “గోపీచందనం”గా పిలువబడే చందనపు ముద్దలు.

సముద్రతీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యుల చేతినుండి ఒక ముద్ద జారిపడి, అందులోని బలరాముని విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం “ఒడభాండేశ్వరం”గా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఇక్కడే ప్రతిష్టించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకుని “ద్వాదశ స్తోత్రం” అనే దివ్యస్తుతిని ఆశువుగా పఠిస్తూ ఉడుపికి తీసుకువచ్చారు. అక్కడగల మధ్వసరోవరం జలాల్లో ఆ చందనపు ముద్దను ముంచగానే, అందులోనుంచి కృష్ణప్రతిమ దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణమందిరంలో అర్చామూర్తిగా పూజలందుకొంటోంది. ఈవిధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణవిగ్రహాన్ని ఉడుపిలో పునఃప్రతిష్టించారు.

ఒక చేత కవ్వాన్ని, మరొక చేత కవ్వపుత్రాడును పట్టుకుని కనిపించే బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడుపి కృష్ణమందిరంలో దర్శిస్తారు. సంసారమనే సాగరాన్ని మధించి, మోక్షమనే వెన్నెను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమా భంగిమలోని అంతరార్థం. ఇక్కడ స్వామివారిని తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శించాలి. దీనిని నవగ్రహకిండి అని పిలుస్తారు. ఇలా నవగ్రహకిటికీ నుండి సకలగ్రహబలుడయిన కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి.

కనకదాసు:

పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యులవారు స్థాపించిన నాటి నుండి పదహారో శతాబ్దం వరకూ భక్తులు, స్వామివారిని నేరుగానే దర్శించేవారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో, బంకాపురమనే ప్రాంతాన్ని పరిపాలిస్తూవుండిన కనక నాయకుడు, భగవత్ప్రేరణానుసారం కనకదాసుగా మారి, ’చెన్న ఆదికేశవ’ అన్న అంకితనామంతో కీర్తనలు వ్రాస్తూ, భక్తిఉద్యమకారుడై తిరిగేవాడు. కురుబ కులానికి చెందిన కనకదాసుకు ఉడుపిలో ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం జరిగింది. అంతేకాదు, అతణ్ణి ఆలయం వెనుకభాగంలో బంధించి, హింసించడం జరిగింది. అప్పుడు “బాగిలను తెరెదు, సేవెయను కొడొ హరియే” అన్న కీర్తనను ఆశువుగా ఆలపించాడు కనకదాసు. భక్తుని ఆర్తికి కరగిపోయిన కృష్ణస్వామి, వెనక్కు తిరిగాడు. అప్పుడు కనకదాసుకు దర్శనభాగ్యం కలగడానికై ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది. దీనినే ఇప్పుడు “కనకన కిండి” అనగా “కనకదాసు కిటికి”గా పిలుస్తున్నారు. ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించిన స్థలం ఉంది. ఇక్కడే ’కనక మండపం’ను నిర్మించడం జరిగింది.

ఉడుపి కృష్ణ మఠం విశేషాలు:

శ్రీకృష్ణమందిరం నలువైపులా గల మార్గాన్ని “రథబీది” అని అంటారు. తిరుమలలోని మాడవీధుల లానే ఉడుపి రథవీధులు కూడా అనేక మఠాలతో నిండివుంటాయి. వీటిలో ప్రధానమైనవి అష్టమఠాలు. శ్రీకృష్ణ దేవాలయ నిర్వహణకై ఎనిమిది మఠాలను స్థాపించారు మధ్వాచార్యులు. వీటినే “అష్ట మఠాలు”గా పిలుస్తారు. ఒక్కొక్క మఠం రెండు నెలల పాటు కృష్ణపూజ చేయాలన్న నిబంధనను విధించారు శ్రీ మధ్వాచార్యులు. ఒక మఠం పూజలను నిర్వహిస్తుంటే మిగిలిన ఏడు మఠాలు ధర్మ ప్రచారం చేయాలని నిర్దేశించారు మధ్వాచార్యులు. ఈ రెండు నెలల పూజా నియమంను పదహారో శతాబ్దంలో వాదిరాజతీర్థులు మధ్వాచార్యుల అనుమతి మేరకు రెండేళ్ళకు మార్చారు. అష్టమఠాలలో ఒకటైన సోదే మఠానికి చెందిన వాదిరాజ తీర్థులు ఏర్పరిచిన నూతన నిమయం ప్రకారం రెండేళ్ళకు ఒక మఠం చొప్పున కృష్ణపూజను నిర్వహిస్తూ వస్తున్నారు. దీనినే ’పర్యాయ పూజ’ అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో, రెండేళ్ళకు ఒకమారు జరిగే ’పర్యాయోత్సవం’ దక్షిణ కర్నాటక ప్రాంతంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిని పొందిన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపును పొందింది.

పర్యాయోత్సవం, కృష్ణాష్టమి ఉత్సవాలప్పుడు, ఇతర పండుగదినాలలో శ్రీకృష్ణుణ్ణి వివిధ అలంకారాలలో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. భక్తులు ఆయా అలంకారలలో కనువిందు చేసే చిన్నారి కృష్ణుణ్ణి దర్శించి, తరిస్తారు. ఆనందసాగరంలో ఓలలాడుతారు. నందనందనుడు, కందర్పజనకుడు, ఇందీవరశ్యాముడూ అయిన ముకుందుణ్ణి మనసారా స్మరిస్తారు. భక్తిపారవశ్యానురక్తులవుతారు.

ఉడుపి ఆలయం లోపల “మధ్వసరోవరం”

శ్రీకృష్ణమందిరానికి అత్యంత సమీపంలో, కనక మండపం ప్రక్కనే ప్రాచీనమైన “అనంతేశ్వర మందిరం” ఉంది. ఇందులో, ఎత్తైన వేదిక మీద శ్రీ అనంతేశ్వరస్వామివారు దీపాల వెలుగులో దివ్యకాంతులీనుతూ దర్శనమిస్తారు. స్కాందపురాణం మేరకు శ్రీమన్నారాయణుని ఆరవ అవతారమైన పరశురాముడే లింగాకారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. “అనంతాసనం” అని కూడా పిలువబడే ఈ దైవమే ఉడుపిలోని ప్రధాన దేవత. “అధ్యాస్తే శేషశయనః స్నిగ్ధాం లింగశిలాం హరిః” అన్న శాస్త్రవచనం మేరకు నారాయణుడే లింగాకృతిలో ఇక్కడ వెలసి, పూజలందుకొంటున్నాడు.

ఉడుపిలో వెలసిన మరొక శివాలయం – శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి మందిరం. ఈ ఆలయ గర్భగృహంలో సుందరమైన శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళీశ్వరుడు కొలువైవుండడం జరిగింది. ఉడుపిని దర్శించే భక్తులు ఈ చంద్రమౌళీశ్వరుణ్ణి తప్పక దర్శిస్తారు.

అన్నబ్రహ్మ ఉడుపి కృష్ణుడు:

ద్వాపరయుగాంతంలో మహానిర్యాణాన్ని సాగించే ముందు, శ్రీకృష్ణుడు, కలియుగ భక్తులకై తన అంశను కలిగిన నాలుగు మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడు. అవే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడు, పంఢరాపురంలోని శ్రీ పాండురంగ విఠలుడు, పూరీలోని శ్రీజగన్నాథుడు, ఉడుపిలోని శ్రీకృష్ణుడు. ఈ కృష్ణరూపాలలో తిరుమల శ్రీనివాసుడు ’కాంచనబ్రహ్మ’గాను, పంఢరాపుర విఠలుడు ’జ్ఞానబ్రహ్మ’ గాను ప్రసిద్ధులయితే ఉడుపి శ్రీకృష్ణుడు ’అన్నబ్రహ్మ’ గా ఖ్యాతిని పొందాడు. ఇందుకు సాక్షిగా ఉడుపి క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతిరోజూ వేలాదిగా భక్తులు ఉదయం, రాత్రివేళల్లో శ్రీకృష్ణప్రసాదాన్ని ఇక్కడ ఆనందంగా స్వీకరిస్తుంటారు. అష్టమఠాలవారు ఇందుకై ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసి, నిత్యం పర్యవేక్షిస్తుంటారు.

గోపూజ:

“గోవృందావనగం, గోకులాధిపం” అని ఆదిత్యపురాణం కీర్తించినట్టుగా శ్రీకృష్ణునికి ఇష్టమైనది గోసేవ. కృష్ణక్షేత్రమయిన ఉడుపిలో గోశాలలు ఉన్నాయి. ఎన్నో రకాల జాతులకు చెందిన గోవులు, వృషభాలను ఇక్కడ చూడవచ్చు. ఈ గోవులకు ప్రతినిత్యం పర్యాయ పూజను నిర్వహించే మఠాధిపతి పూజలను నిర్వహిస్తారు. భక్తులు కూడా గోపూజను జరిపే అవకాశం ఉంది.

ఉడుపి దర్శన ఫలం:

వ్యాసరాజతీర్థులు, వాదిరాజతీర్థులు, పురందరదాసు, కనకదాసు, విజయదాసు వంటి ఎందరో కర్నాటక వాగ్గేయకారులు ఉడుపి కృష్ణుని వైభవాన్ని, మాహాత్య్మాన్ని కన్నడ, సంస్కృత భాషలలో కీర్తించారు. “ముద్దు కృష్ణన దర్శన ఆనంద ఆనంద” అంటూ పరవశించారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య కేంద్రబిందువై అలరారుతున్న ఉడుపి క్షేత్రం తప్పక దర్శించవలసిన పుణ్యస్థలం. ఇక్కడ వెలసిన బాలకృష్ణుని దర్శనం వల్ల మానసిక క్లేశాలు తొలగిపోతాయి. సంతానాభివృద్ధి కలుగుతుంది. మనఃకారకుడయిన చంద్రుని విశేష అనుగ్రహం లభిస్తుంది. జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు సిద్ధిస్తాయి.