కృష్ణాష్టమి
కృష్ణ జన్మాష్టమి ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. కృష్ణుడు, రాముడు గుర్తురాకుండా హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చును. నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి సంతానంగా ఎనిమిదో గర్భంలో జన్మించాడు. శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో, జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
కృష్ణాష్టమి పండుగ విధానం
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.
శ్రీకృష్ణాష్టమి విశిష్టత, జరుపుకునే విధానం
కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంటి ముఖ ద్వారాలకు పచ్చని మావిడాకు తోరణాలు, వివిధ పూవులతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి.. చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో స్వామి వారిని పూజిస్తారు.పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు.
కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాన్దపురాణం చెబుతుంది. ఈ రోజున బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని తయారుచేసి వెండి, బంగారు పాత్రలలో దానిని ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది.
అదే విధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే.. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు