పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన
నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని
హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో
ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి
పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి
పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.