శ్రీ సాయిబాబా ఆలయం - గుడిమల్కాపూర్

Sample Image

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం, మెహదీపట్నానికి సమీపాన ఉన్న గుడిమల్కాపూర్ లో సాయి బాబా ఆలయం ఉన్నది. ఇది నూతనంగా నిర్మించిన ఆలయం. మార్చి 23వ తేదీన 2008వ సంవత్సరంలో శ్రీ సాయినాథుని ప్రతిష్ట జరిగింది.

ఈ మందిరంలో సాయి మూలమూర్తికి ఎదురుగా పాలరాతి నంది ఉన్నది. గర్భాలయంలో రజత సింహాసనంపై ఆసీనుడై సాయిబాబా విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం ముందు సాయిబాబా వారి మరో చిన్న విగ్రహం ఉన్నది. ఈ విగ్రహాన్ని భక్తులు పంచామృతాలతో అభిషేకిస్తారు. సాయివిగ్రహం ఊర్ధ్వభాగాన సాయి వెండి పాదాలు దర్శనమిస్తాయి.

షిరిడిలో వలెనే ఈ ఆలయంలో కూడా సాయిబాబాకు కాగడ హారతి తర్వాత మంగళస్నానం చేయిస్తారు. ప్రతి గురువారం అధిక సంఖ్యలో భక్తులు బాబా దర్శనానికి వస్తారు.

శ్రీ సాయిబాబా ఆలయం అనేక ఉపాలయాలతో కళకళలాడుతుంటుంది. మందిర ప్రాగణంలో సాయి ఆలయానికి కుడివైపు తెల్లని పాలరాతి గణేశమూర్తి దర్శనమిస్తాడు. ఆలయానికి ఎడమవైపు దత్తాత్రేయ స్వామి శ్వేతవర్ణ శోభిత పాలరాతి విగ్రహం దర్శన మిస్తుంది.

సాయిబాబా ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు భాగంలో ద్వారకామాయి ఉన్నది. ఇచ్చటనే ధుని ఉంటుంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ కృష్ణ దేవరాయలకాలంలో నిర్మించిన శ్రీ త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, గర్భాలయంలో నాగఫణిభూషిత సహితంగా ఉన్న త్రయంబకేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ మూర్తి వెనుకభాగంలో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి.