శ్రీ సాయిబాబా మందిరం - సైనికపురి

Sample Image

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, సైనిక్ పురి తపాలా కార్యాలయానికి సమీపంలో ఉన్న సాయిపురిలో శ్రీ సాయిబాబా ఆలయం ఉన్నది. 1998న ఏప్రిల్ 2వ తేదీన ఆలయంలో బాబా ప్రతిష్ట జరిగినది. ప్రధాన స్వాగతద్వారంపై షిర్డిసాయి, సాయికి ఇరువైపులా గణపతి, దత్తాత్రేయ మూర్తులు ఉన్నారు. మందిరంపై చుట్టూ పలు దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ప్రధాన ప్రవేశద్వారానికి కుడివైపున గణపతిమూర్తి కొలువుదీరి ఉన్నాడు.

గర్భాలయంలో రజత సింహాసనంపైన, పాలరాతితో తీర్చిదిద్దిన సాయిబాబాను భక్తులు దర్శిస్తారు. బాబా విగ్రహం సజీవంగా ఉంటుంది. బాబా మందిరంలో సాయి విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏకశిలా నిర్మితమైన బాబా మూర్తి పాదపీఠం వద్ద పాదుకలు ఉన్నాయి. సాయికి కుడివైపున రజతమయ ఓంకారం, ఎడమవైపున స్వస్తిక్ ఆకృతి ఉన్నాయి. సాయి మంటపానికి వెలుపల ధుని నెలకొని ఉంటుంది. భక్తులు ఈ ధుని చుట్టూప్రదక్షిణ చేస్తారు.

ఈ ఆలయ ప్రాంగణంలో ఒక శివాలయం ఉన్నది. ఈ శివలింగానికి భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. షిరిడిలోని సాయిబాబా ఆలయంలో జరిగే విధంగానే ఇక్కడ కూడా పూజాకార్యక్రమములు నిర్వహిస్తారు.

శ్రీ సాయిబాబా ఆలయం అనేక ఉపాలయాలతో కళకళలాడుతుంటుంది. మందిర ప్రాగణంలో సాయి ఆలయానికి కుడివైపు తెల్లని పాలరాతి గణేశమూర్తి దర్శనమిస్తాడు. ఆలయానికి ఎడమవైపు దత్తాత్రేయ స్వామి శ్వేతవర్ణ శోభిత పాలరాతి విగ్రహం దర్శన మిస్తుంది.

ప్రతి గురువారం, ఇతర ముఖ్య పర్వదినాలలో భక్తులు సామూహిక షిరిడిసాయి వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో ఆచరిస్తారు. ప్రతీ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దసరాదినాలలో వాహన పూజలు, ప్రత్యేక అలంకరణలు జరుగుతాయి.