మల్లికార్జున దేవాలయం, ఇనవోలు
తెలంగాణ రాష్ట్రములోని వరంగల్లు నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అయినవోలు అనే గ్రామం కలదు. ఈ గ్రామంలోనే కాకతీయ రాజులు కట్టించిన శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందినది.
శివుని అంశలు కూడా కొన్ని ప్రాంతాలలో గ్రామదైవాలుగా పూజలు అందుకోవటం జరుగుతుంది. అలాగే మల్లన్న అనే పేరుగల గ్రామదైవం మల్లిఖార్జున స్వామి అనే శివునియొక్క అంశ అని తెలుస్తున్నది.
శ్రీ మల్లిఖార్జునస్వామి యొక్క ఒక అవతారాన్ని తమ కులదైవంగా ఆ ప్రాంతంలో జీవిస్తున్న కురుమలు, బలిజలు మరియు యాదవ కులాలకు చెందిన ప్రజలు పూజించటం జరుగుతున్నది. కాకతీయ పరిపాలన కాలములో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయనే ఈ దేవాలయం నిర్మించినట్లు తెలుస్తుంది. అయ్యన్న ఈ ఆలయం నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. క్రమముగా అది అయినవోలు (ఐలోని)గా రూపాంతరం .
ఈ స్వామివారు యాదవుల ఆడబిడ్డ గొల్లకేతమ్మను, లింగబలిజ వారి ఆడబిడ్డ అయిన బలిజ మేడాలమ్మ దేవిని వివాహమాడారు. మల్లన్నస్వామికి కుడివైపున "గొల్లకేతమ్మ” ఎడమప్రక్కన "బలిజమేడలమ్మ" కొలువై ఉండగా, ఈ ఇరువురు దేవేరులతో, స్వామివారి విగ్రహము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ దేవుడు శివస్వరూపముగా, శివుని మరో అవతారముగా చెప్పబడుతున్నది. దీనికి కారణము ముందు భాగంలో లింగ స్వరూపంలో మూలవిరాట్ మల్లిఖార్జునస్వామి (మల్లన్న) ఉండటము. ఈ శివ లింగస్వరూపము అర్థ పానవట్టం కలిగి ఉండటం మరో విశేషం. ఒక లింగం శ్వేతవర్ణము కలిగి అర్ధపానవట్టం ఉండటముచేత ఈ ఆలయం, ఇందలి దైవము అయిన మల్లన్న స్వామి వారు ఎంతో వివిష్టత సంతరించుకొన్నారు. ఈ లింగమునకు ప్రతిదినం శైవాగమ పద్ధతిని అనుసరించి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరుగుతుంది.
తొలి ఏకాదశినాడు మ న్యాసపూర్వక రుద్రాభిషేకము, వినాయకచవితి సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవము లు, దసరా పర్వదినాలలో మహా న్యాసపూర్వక రుద్రాభిషేకము, శమీపూజ, దీపావళి సంద ర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, దీపోత్స వము, కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవము, ధను ర్మాసంలో ఏకాదశి రుద్రా భిషేకములు అతి వైభవంగా మిక్కిలి భక్తి శ్రద్ధలతో జరు గును. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివార్ల కరుణా కటాక్ష కృపకు పాతృలవుతారు.
ఆలయ విశేషాలు:
పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( సా .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరు అయ్యన-ప్రోలుగా, కాలాంతరంలో అయినవోలు ఐనవోలుగా ప్రసిద్ధి చెందింది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న (మల్లికార్జున స్వామి) యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం, ఢమరుకం, పాన పాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుప్రక్కల భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేలు రాయుడు అని కూడా పిలుస్తారు.
విశేష ఉత్సవాలు:
స్వామివారి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతియేట మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతఃకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి.
ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతీ మాసశివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారులు నిర్వహించారు.