అగస్త్యేశ్వరాలయం-చెన్నూరు

Sample Image

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి సుమారు 30 కి.మీ. దూరంలో చెన్నూరు గ్రామం కలదు. ఈ గ్రామములో శ్రీ అగస్త్యేశ్వరాలయం ఉన్నది. ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఉత్తర వాహిని తీరం అని కూడా పిలుస్తారు.

ప్రాచీన ఆలయాల్లో అగస్త్యేశ్వరాలయం ఒకటి. ద్వాపరయుగంలో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికివచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకూ ముగ్ధుడైన ఆ మహర్షి ఇక్కడ ఓ భారీ శివలింగాన్ని ప్రతిష్టించాడు.

ఇలా ఇక్కడ నిర్మితమైన ఈ ఆలయానికి అగస్త్యేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఆ తరువాత 1289వ సంవత్సరంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది.

అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయంపై దాడిచేసి గోపురాన్ని ధ్వసం చేయగా, శ్రీకృష్ణదేవరాయలు చెన్నూరు ప్రాంతానికి వచ్చిన సమయంలో ఈ ఆలయాన్ని మరోసారి పునర్నిర్మించినట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక శాసనం చెబుతుంది. ఈ శాసనం తెలుగు, కన్నడ మిశ్రమ భాషల్లో కనిపిస్తుంది. ఈ శాసనంపై కృష్ణరాయల కాలంలో ప్రసిద్ధి పొందిన మహామంత్రి తిమ్మరుసు సంతకం మనకి నేటికీ దర్శనమిస్తుంది.

సాధారణంగా నదులన్నీ పశ్చిమదిశ నుండి తూర్పునకు ప్రవహిస్తాయి. కానీ ఇచట ఉన్న గోదావరి నదికి ఒక ప్రత్యేకత ఉంది. కాశిలో గంగానది ఉత్తరదిశగా 6 కి.మీ., ప్రవహిస్తుండగా చెన్నూరు మండలంలో పక్కూర్ గ్రామం నుండి కోటపల్లి మండలంలో పదుపల్లి గుట్టలవరకు గోదావరినది ఉత్తరదిశగా 15 కి.మీ., ప్రవహిస్తోంది.

పారుపల్లి గుట్టలపై దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహ రూపాన్ని చూడలేక గోదావరి నది ఉత్తరంగా ప్రవహించిందని పెద్దలు అంటారు. గోదావరి జన్మస్థలం నుంచి సముద్రంలో కలిసే వరకూ ఈ విధంగా ఉత్తర దిశగా ప్రవహించడం మరెక్కడా లేదు. అందుకే ఆ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించటానికి, తల్లితండ్రుల అస్థికలు నిమజ్జనం చేయడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇచ్చటికి తరలివస్తుంటారు.

గోదావరి ప్రత్యేక ప్రవాహం వల్లే ఈ ప్రాంతానికి ఉత్తరవాహిని తీరం అనే పేరు కూడా వచ్చింది. ఇంత గొప్ప విశిష్టత కల్గిన ఈ నదిలో ఆంజనేయుడి తల్లి అయిన అంజనాదేవి స్నానమాచరించిందని స్థలపురాణం తెలియజేస్తుంది. ఈ ఆలయ గర్భగుడిలో అగస్త్యుడు ప్రతిష్టించిన భారీ శివలింగం దర్శనమిస్తుంది. ఇచటి గర్భగుడిలో మరొక విశేషం అఖండజ్యోతి.

ఇది సుమారు 410 సంవత్సరాల నుంచి నిరంతరం వెలుగుతూనే ఉంది. పూర్వం దీన్ని జక్కెపల్లి సదాశివయ్య అనే బ్రాహ్మణభక్తుడు ఈ అఖండ దీపాన్ని వెలిగించాడు. నాటినుంచి నేటివరకు జ్యోతి దేదీప్యమానంగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది.

సదాశివయ్య తదనంతరం ఈ జ్యోతి బాధ్యతలనూ, నిత్యపూజలనూ ఆయన కుమారులే చూసుకుంటున్నారు. ప్రస్తుతం నాలుగో తరానికి చెందిన హిమకర్ శర్మ వీటిని నిర్వహిస్తున్నారు.

గోదావరి పుష్కరాల సమయంలో రాష్ట్రంలోని ఇతరజిల్లాల నుంచే కాక మహారాష్ట్ర నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ తీరంలో పుణ్యస్నానాలు చేస్తారు. శివరాత్రి రోజున అఖండజ్యోతికి పూజలు నిర్వహించి, శివపార్వతుల కళ్యాణం చేస్తారు.కార్తీకమాసంలో వైకుంఠ చతుర్దశి వేడుకను వైభవంగా భక్తులు జరుపుతారు. ఆ రోజు రాత్రి భక్తులు శివలింగానికి ఉమ్మెత్తపూలతో పూజ చేస్తారు. శ్రావణమాసంలో నెలరోజుల కఠోర శివదీక్షతో భక్తులు ఈ శివలింగానికి అభిషేకాలు చేస్తారు.