అమరావతి అమరేశ్వరుడు
అమరావతి చరిత్ర నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆ నాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీతీరమగుటచేత సారవంతమైన భూమి వున్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృద్ధి చెందింది. అంతేకాదు, బౌద్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. అశోక చక్రవర్తి బౌధ్ధమత ప్రచారానికి మహాదేవస్ధవీరుడు అనే ఆయనను ఈ ప్రాంతానికి పంపించాడు. అతడు ధాన్యకటకమును కేంద్రముగా చేసుకుని తన ప్రచారాన్ని సాగించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పడున్న స్తూప ప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారింది. దీని నిర్మాణం నాగరాజులనుండి నాగార్జుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తయింది.
అమరావతి విద్యా విషయంలో కూడా చాలా ప్రసిద్ధికెక్కింది. ఆచార్య నాగార్జునుడు స్ధాపించిన విశ్వ విద్యాలయంలో చైనా, జపాను, టిబెట్టు, సింహళ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు విద్యని అభ్యసించేవాళ్ళు. ఇలాంటి విద్యాపీఠాలు ఇంగా వున్నందువల్ల విద్యనభ్యసించేవారి సంఖ్య వేలలో వుండేది. వాటి నిర్వహణ, విద్యార్ధుల వసతి, భోజనాలన్నీ రాజులే ఏర్పాటు చేయించారు. తర్వాత ధాన్యకటకం నుంచి శ్రీ కొండకి విద్యాపీఠాన్ని మార్చి ఆ కొండకు నాగార్జున కొండ అని, ఆవిద్యా పీఠానికి నాగార్జున విద్యాపీఠమని పేరు పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి అనేక కానుకలు ఇచ్చారు.
తర్వాత కాలంలో ఇక్ష్వాకులు తెలుగు నేలను పరిపాలించారు. కానీ వారు శ్రీ కొండను (నేటి నాగార్జున కొండ) రాజధానిగా చేసుకున్నారు. దానితో ధాన్యకటకము ప్రాబల్యము తగ్గింది. శంకరాచార్యుల వారి కార్య దీక్షతో వైదిక మతం మళ్ళీ బలపడింది. క్రీ.శ. 5 వ శతాబ్దములో చైనా యాత్రికుడు హుయాన్ చాంగ్ కూడా ధాన్యకటకము గురించి వ్రాశాడు. క్రీ.శ. 1526 లో హంద్రికల పెదప్పంగారు ఆలయాన్ని మూడోసారి పునరుద్ధరించారు. తురుష్కుల దాడులలో ధాన్యకటకము అతలాకుతలమయింది. స్తూపము నేలమట్టమయింది. కోట పాడుపడింది. అమరేశ్వరుడు మాత్రం ఆరాధ్యదైవంగానే వున్నాడు.
అయినా ఆంధ్రరాజులకు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచినవారిలో శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ముఖ్యుడు. ఈయన హయాంలో ఆలయ పునరుద్ధరణ చెయ్యటమేగాక అక్కడ పని చేసేవారికి, వ్యాపారులకు ఇళ్ళు కూడా కట్టించారు. క్రీ.శ. 1816 లో ఈయన మరణించిన తర్వాత స్వామివారి ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది ఏర్పడింది. అప్పుడు అర్చకులు హైదరాబాదు నవాబైన నాజరుద్దేలా గారికి చందూలాల్ అనే దివానుగారి ద్వారా పరిస్థితి వివరించారు. నవాబు స్వామిని చెప్పమనండి చూద్దాం అన్నారుట. నవాబుకు అమరేశ్వర స్వామి కలలో కనబడి తన భక్తుల కోరిక తీర్చమని చెప్పాడుట. నవాబు సంతోషంతో ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని దెందుకూరు గ్రామంలో షుమారు 450 ఎకరాల భూమే కాక సంవత్సరానికి 1000 హాలీ రూపాయలు నగదు ఇవ్వటానికి ఫర్మానా జారీ చేశారు.
స్థల పురాణం:
ఈ దేవాలయంలోని శివలింగాని దేవతలరాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధి గాంచింది. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది.
ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా వుండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి, ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూవుంటారు. ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలమీద కొట్టడం జరిగింది. శివలింగం పైభాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికీ ఆ రక్తపు మరక ఉంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
ఆలయ విశేషాలు:
ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నాయి. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి es దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.
ఆలయంలో మనకు కనిపించే అర్చా మూర్తి 10 అడుగుల పొడుగు, రెండు అడుగుల వెడల్పు కలిగి తెల్లటి మార్బుల్ రాయిలాగా వుంటుంది. మిగతా భాగము క్రింది భాగములో భూమిలో వున్నది. స్వామికి అభిషేకం చేయటానికి వీలుగా గర్భ గుడిలో ఒక ప్రక్కనుంచి మెట్లు వుంటాయి. వాటి మీద నుంచి వెళ్తే వైన బాల్కనీ లాంటి ప్రదేశంలో నుంచుని స్వామికి అభిషేకం చేస్తారు. అందరికీ గర్భ గుడిలోకి ప్రవేశం లేదు. ఇక్కడ అమ్మవారు శ్రీ బాల చాముండేశ్వరీ దేవి. ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి.
పూర్వం దేవతలు దానవుల మీద యుధ్ధానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు వుండి, ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించినవారిలో శౌనకాది మహా మునులు కూడా వున్నారు. యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోఛ్ఛారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుంది.