శివరాత్రి
మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శాస్త్రాల ప్రకారం, శివరాత్రి వేళ పవిత్ర నియమ నిబంధనలను ఆచరించిన వారికి, ఈ పవిత్రమైన రోజున ఉపవాస ఉండటం వల్ల విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. అంతేకాదు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సులభంగా పరిష్కారం లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.
పూజా విధానం..
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
1. జాగరణము
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున ఉపవాసము ఉంటారు. ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్ ఓం నమః శివాయః
2. రుద్రాభిషేకం
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
3. పంచాక్షరి మంత్రం
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
4. మహామృత్యుంజయ మంత్రం
మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
శివుడు ఇష్టమైన రోజు
భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు, ఆచారాలు పాటించేవారు, పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షంలో, తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి, ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది.
మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది. గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
మహాశివరాత్రి వ్రత కథ
ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.