Responsive HTML Page

సుమతీ శతకము

  1. కరణము సాదై యున్నను
    గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
    ధరఁ దేలు మీటకున్నను
    గరమరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!

    భావం:

    కరణము మెత్తనితనము గలిగియుండినను, ఏనుగు మదము విడిచినను, పాముకరవకున్నను, తేలుకుట్టకుండిననుజనులు లక్ష్యముచేయరు.

  2. ఇచ్చునదె విద్య, రణమునఁ
    జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులు
    మెచ్చునదె నేర్పు, వాదుకు
    వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!

    భావం:

    ధనము నిచ్చునదే విద్య, యుద్ధభూమిలో చొరబదునదే పౌరషము. గొప్ప కవులు గూడ మెచ్చు నట్టిదే నేర్పరి తనము, తగువునకు వచ్చుటయే చెరవు.

  3. కడు బలవంతుండైనను
    బుడమినిఁబ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
    దడ వుండనిచ్చె నేనియుఁ
    బడుపుగ నంగడికిఁదానె బంపుట సుమతీ!

    భావం:

    ఎంత బలవంతుడైనను, పడుచు పెండ్లామును ఆమె పుట్టింటి దగ్గర యెక్కువ కాల ముండనిచ్చిన యెదల, తానే యామెను వ్యభిచారిణీగా దుకాణమునకు పంపినట్లగును.

  4. కసుగాయఁగఱచి చూచిన
    మసలక తన యొగరు గాక మధురంబగునా?
    పస గలుగు యువతు లుండఁగఁ
    బసిబాలలఁబొందువాఁడు పశువుర సుమతీ!

    భావం:

    పండిన పండు తినక, పచ్చికాయకొరికినచో వెంటనే వగరు రుచి తోచునుగాని, మధురమెట్లు గలుగునో; అట్లే యౌవనము గల స్త్రీ లుండగా పసి బలికలతో కూడినచో వికటముగా నుండును. చిన్న బాలికల పొందు గూడిన వాడు పశువుతో సమానుడు.

  5. ధనపతి సఖుఁడై యుండియు
    నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
    దనవారి కెంత గలిగిన
    తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!

    భావం:

    ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడై నప్పటికినీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద యున్నను, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగించును.

  6. తనవారు లేని చోటను
    జన వించుక లేనిచోట జగడము చోటన్,
    అనుమానమైన చోటను,
    మనుజును ట నిలువఁదగదు మహిలో సుమతీ!

    భావం:

    తన బంధువులు లేని తావునను, తనకు మచ్చికలేని తావునను, తనపై ననుమాన మయిన తావునను మనుష్యుడు నిలువ కూడదు.

  7. తములము వేయని నోరును
    వినుతులతో జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
    గమలములు లేని కొలకుఁను
    హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

    భావం:

    తాంబూలము వేసుకొనని నోరును, విరుద్ధమైన మతము గల వారితో స్నేహముచేసి విచారించు వివేకమును, తామరలు లేని సరస్సును, చంద్రుడు లేని రాత్రియును నీచ మయినవి.

  8. తలపొడుగు ధనముఁబోసిన
    వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ
    దల దడివి బాస జేఁసిన
    వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!

    భావం:

    తల పొడుగు, ధనము పోసినప్పటికినీ వేశా స్త్రీకి సత్యమాడుట లేదు. తల మిద చేయి వేసుకొని ప్రమాణము చేసినను వార కాంతను నమ్మరాదు.

  9. తలమాసిన వొలుమాసిన
    వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
    కులకాంతలైన రోఁతురు
    తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

    భావం:

    ఆలోచింపగా, భూమియందు, తలయు, శరీరము, బట్టలుమాసినచో పెనిమిటినైననూ (నుంచి స్త్రీలైనప్పటికిన్నీ) అసహ్యపడుట నిజము.

  10. దగ్గర కొండెము సెప్పెడు
    ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
    నెగ్గుఁ బ్రజ్జ కాచరించుట
    బొగ్గులకై కల్పతరువుఁబొడచుట సుమతీ!

    భావం:

    దగ్గర నున్న మంత్రి చెప్పు చాడీలను విని; రాజు యిష్టపడి; ప్రజలకు కీడు చేయుట అనునది; కోరిన కొరికల నిచ్చు చెట్టును బొగ్గులకై నరకుటతో సమానముగా నుండును.

  11. కాదుసుమీ దుస్సంగతి
    పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
    వాదుసుమీ యప్పిచ్చుట
    లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

    భావం:

    దుర్జన స్నేహము కూడదు. కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు. అప్పునిచ్చుట కలహమునకు మూలము. స్త్రీలకు కొంచెమైనను ప్రేమ ఉండును.

  12. . నరపతులు మేరఁదప్పిన
    దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్
    గరణము వైదికుఁడయినను
    మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!

    భావం:

    రాజులు ధర్మము యొక్క హద్దు తప్పినను; విధవాస్త్రీ ఇంటి యం ఏల్లకాలము పెత్తనము చేసినను, గ్రామకరణము పైదికవృత్తి గల వాడైనను ప్రానము పోవునంతటి కష్టము తప్పకుండా సంభవించును.

  13. పగవల దెవ్వరితోడను,
    వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
    దెగనాడవలదు సభలను
    మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!

    భావం:

    ఎటువంటి వారితోనూ పగపెట్టుకొనరాదు. బీదతనము సంభవించిన తరువాత విచారింపరాదు. సభలలో మోమాటములేకుండ మాట్లాడరాదు. స్త్రీకి, మనసులోని వలపు తెలుపరాదు.

  14. పలుదోమి సేయు విడియము
    తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్
    పొలయలుక నాఁటి కూటమి,
    వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

    భావం:

    దంతములు తోముకొనినవెంటవే వేసుకొను తాంబూలమును, తలంటుకొని స్నానముచేసిననాటి నిద్రయును, స్త్రీలతో ప్రనయకలహమునాడు కూడిన పొందును. వీటి విలువ ఇంతయని చెపలేము సుమా.

  15. పులిపాలు దెచ్చియిచ్చిన
    నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
    దలపొడుగు ధనముఁబోసిన
    వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ!

    భావం:

    పులి పాలు తెచ్చినను, గుండెకాయను కోసి అరచేతిలో బెట్టినప్పటికినీ, తలేత్తు ధనముపోసినప్పటికినీ, వేశ్యాస్త్రీకి ప్రేమ ఉండుదు.

  16. మానధనుఁడాత్మదృతిఁచెడి
    హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
    మానెండు జలము లోపల
    నేనుఁగు మెయిదాఁచినట్టు లెరుగుము సుమతీ!

    భావం:

    అభిమానసంతుడు ధైర్యము తొలగి నీచుని సేవించుత కొంచెను నీళ్ళలొ ఏనుగు శరీరమును దాసుకొను విధముగా నుండును.

  17. 'రా, పొ'మ్మని పిలువని యా
    భూపాలునిఁగొల్వ భుక్తి ముక్తులు గలపే ?
    దీపంబు లేని యింటను
    జే పుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!

    భావం:

    దీపములేని ఇంటిలో చేతి పట్టులాడిన పట్టు దొరకనియట్లే 'రమ్ము పొమ్ము 'అని ఆదరింపని రాజును సేవించుటవలన భూక్తిముక్తులుగల్గవు.

  18. వెలయాలి వలనఁగూరిమి
    గలుగదు మఱిఁగలిగెనేని కడతేరదుగా
    బలువురు నడిచెడు తెరువునఁ
    బులు మొలవదు మొలచెనేని బొదలదు సుమతీ!

    భావం:

    పదుగురు నడిచే మార్గము నందు గడ్డి మొలవనే మొలవదు. ఒకవేళ కలిగినా, కడవరకు స్థరముగనుండదు. అట్లే వేశ్య ప్రేమించదు. ప్రేమించిననూ తుదివరకూ నిలువదు.

  19. వెలయాలు సేయు బాసలు
    వెలయఁగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్.
    గలలోఁన గన్నకలిమియు,
    విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

    భావం:

    వేశ్యా ప్రమాణములును, విశ్వ బ్రాహ్మణుని స్నేహమును, వెలమ దొరల జతము, కలలో చూచిన సంపదయు, స్పష్టముగానమ్మరాదు.

  20. పొరుగునఁ బగవాఁడుండిన
    నిర నొందఁగ వ్రాఁతకాడె యేలికయైనన్
    ధరఁగాఁపు గొండెయైనను
    గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ!

    భావం:

    ఇంటి పొరుగున విరోధి కాపురమున్ననూ, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుదైననూ, రైతు చాడీలు చెప్పెడివాడైననూ కరణములకు బ్రతుకుతెరు ఉండదు.