శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం

Sample Image

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, భారతదేశం, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెంకొర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది. మలయాళం, తమిళంలో 'తిరువనంతపురం' నగరం పేరు "ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత" అని అనువదిస్తుంది (అనంత విష్ణు రూపం). ఈ ఆలయం చేరా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండిటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది, ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది. కొన్ని సంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లా లోని, కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది ("మూలస్థానం"), వాస్తుపరంగా కొంత వరకు, ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లా, తిరువత్తర్‌ లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ప్రధాన దైవం పద్మనాభస్వామి (విష్ణువు), "అనంత శయన" భంగిమలో, అనంతమైన పాము ఆది శేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు. పద్మనాభస్వామి ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. ట్రావెన్‌కోర్ మహారాజు మూలం తిరునాళ్ రామవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త.

చరిత్ర:

ట్రావంకోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీమహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరాముడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం). సా.శ. 16వ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది.

అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది.ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్థుగా పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్ల్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.

ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర) ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.

స్థలపురాణం:

తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడుఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం' లో ప్రతిష్ఠించినట్లు కథాంశం.