అనంతగిరి కొండలు

Sample Image

అనంతగిరి కొండలు భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉన్నాయి.ఈ కొండల పైనుండి నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్ప్రవహిస్తాయి.ఇది తెలంగాణ రాష్ట్రం లోని అతి పెద్ద దట్టడవి. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం. ఇవి వికారాబాదుకు 5 కి.మీ దూరంలో ఉంటాయి.

అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం:

ఇది ప్రాచీన ఆవాస ప్రదేశం. ప్రాచీన గుహలు కొన్ని కోటలు, దేవాలయం ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి.

ఈ దేవాలయం అనంతగిరి కోండలలో హైదరాబాదు నగరానికి సుమారు 75 కి.మీ దూరంలో నిర్మితమైనది. ఇది 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబుచే నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు "అనంత పద్మనాభస్వామి" రూపంలో ఉంటాడు. అందువలన ఈ ప్రాంతానికి అనంతగిరి అని పేరు వచ్చింది.

మూసీనది:

మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన వికారాబాదు జిల్లా, వికారాబాదు సమీపంలోని అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది.

స్థల పురాణము:

ఇక్కడి పద్మనాభ ఆలయ చరిత్ర దాదాపు 1300 సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవి. స్థలపురాణం కథనాల ప్రకారం అలనాడు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకునేవారు. ముచుకుందుడనే మహర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడిని కీర్తించి, భూలోకంలో తనకు అలసట తీర్చుకోవడానికి సుఖంగా నిద్రించడానికి కావాల్సిన అహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని చూపాల్సిందిగా, అంతే కాకుండా తన నిద్రను భంగం చేసినవారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేలా వరమి వ్వాలని కోరాడు. దేవేంద్రుడు అనంతగిరి గుహలను చూపించగా ఓ గుహను నివాసంగా చేసుకుని ముచుకుందుడు నిద్రపోయాడు. ముచుకుందుడి చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయి నేడు ముచుకుందానదిగా ప్రసిద్ధి చెందిందన్న కథనం ప్రచారంలో ఉంది. కాలక్రమేణా మూసీనదిగా మారింది. ఇక్కడ పుట్టిన మూసీ నది హైదరాబాద్‌ మీదుగా నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచికుందా నది ప్రవహిస్తోంది. కృష్ణుడు ముచికుందునకు అనంత పద్మనాభస్వామి రూపంలో దర్శనమివ్వడం వల్ల ఈ ఆలయానికి అనంత పద్మనాభ క్షేత్రంగా పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పక్కనే భవనానిశిని అని పిలిచే భగీరథగుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం జనాల్లో ఉంది.

అనంతగిరి కొండలు వీక్షణ ప్రాంతం:

ఇది అనంత పద్మనాభస్వామి దేవాలయం నుండి ఎడమవైపు దారిలో మొదటి కుడివైపు మార్గం గుండా వెలితే అనంతగిరి కొండలన్నిటిని వీక్షించవచ్చు.

అనంతగిరి జల పాతాలు:

ఆలయం కుడివైపునకు 2 కి.మీ దూరంలో కొండల మధ్యలోని ఉన్నటువంటి జలపాతాలను చూడవచ్చు.