వేమన శతకము
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!భావం:
మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!.
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.
నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.
మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినురవేమ!భావం:
మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పతికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.
మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వ దాభిరామ! వినుర వేమ!భావం:
అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలొపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడ పైన పటారము లొన లొటారముగ ఉంటుంది.
నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినురవేమ!భావం:
తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినురవేమ!భావం:
గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.
నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
ఓ వేమా ! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిల్లిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించుచుండును. చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా, మంచిగుణములు గలవారు మాట్లాడరు.
అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!భావం:
ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.
కులము లోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్ని పొందుతుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ
జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల
విశ్వదాభిరామ! వినురవేమ!భావం:
చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.
కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన
కులము చెడును కాని గుణము వలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
చెరకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా గుణహీనుడైనవ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవును.
రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైన కష్టము కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితె వికారమును కలిగిస్తుంది.
వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
వేరువురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు.
హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.
విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!భావం:
హంసలతో కలిసినంత మాత్రమున కొంగ మారనట్లుగా, పండితులతో కలిసినప్పటికి మూర్ఖుడు మారడు.